సుస్వాగతం

ప్రియమైన తెలుగు వారందరికి నమస్కారాలు

LOOK AT THE NEWS

LOOK AT THE NEWS
FOR ALL TELUGU PAPERS

16, ఆగస్టు 2011, మంగళవారం

వాడుకపదాల్ని కాపాడుకుందాం... కదలిరండి



సోదర సోదరీమణులారా... తెలుగు వాడకాన్ని ఇతోధికంగా పెంచి భాషాభివృద్ధి
జరపాలన్నది మన అతి ముఖ్యమైన లక్ష్యం. ఇందుకు సంబంధించి మనమంతా రోజువారీగా
అధ్యయనం జరిపి దఖలుపరిస్తే బాగుంటుందని నా ఉద్దేశ్యం. ఇందుకు సంబంధించి
నాకు తోచిన కొన్ని ఆలోచనల్ని మీతో పంచుకుంటాను.

అసలు తెలుగు పదమంటూ లేకుండా నేరుగా ఆంగ్లంలో వాడుతున్న పదాల్ని గుర్తించి
వాటికి తెలుగు పదాల్ని రూపొందించాలి. ఉదాహరణకు... petrol, Kirosene, gas,
governor, SP, Police, Computer, bus stand, cassettee, Channel,
Incoming Call, Marks, Licence... లాంటివి. వీటిలో కొన్నిటికి
ఒకప్పుడేమైనా తెలుగు పదాలున్నాయేమో నాకు తెలీదు కానీ ప్రస్తుతం వీటిని
ఉదాహరణకోసం తీసుకున్నాను. ఇలాంటివి కోకొల్లలు. పై పదాలలో చాలావాటికి
తమిళ, కన్నడ, హిందీ భాషల్లో అనువాదాలున్నాయి.

Petrol, Kirosine Computer, bus, Marks, cassettee, bomb, Channel లాంటి
పదాలు జనంలో నరనరానా ఆంగ్లంలోనే జీర్ణించుకుపోయాయి... వాటికి తెలుగు
అనువాదం చేస్తామంటున్నారు మీకేమైనా పిచ్చా అని నన్ను అనొచ్చుగాక... మరి
మన పక్కనున్న తమిళనాడులో వీటన్నిటికీ ప్రసారమాధ్యమాల్లో తమిళభాషలోనే
వాడుతున్నారు. వాళ్ళకి పిచ్చి అనుకుంటే... నేనూ పిచ్చోణ్ణే. వాళ్ళు
వీటన్నిటికీ అనువాదాలు చేసుకుని, వాడుకలో ఉంచుకుని భాషను
కాపాడుకుంటున్నారు. పై పదాలకు కల్ఎణ్ణ, మన్నెణ్ణ, గణిని, పేరుందు,
మదిప్పెణ్, ఒళినాడా, వెడి గుండు, వాహిని (చివరి పదం కన్నడం) అనే
అనువాదాలున్నాయి.

తమిళనాడులో శాస్త్రసాంకేతిక పట్టభద్ర, ఉన్నత విద్యల్ని (వైద్యం లాంటి
విజ్ఞానశాస్త్రాలు) తమిళంలోనే బోధించేందుకు ప్రస్తుతం తమిళనాడు ప్రభుత్వం
కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. న్యాయవ్యవస్థలో తీర్పులు, వాదనలు
తమిళంలో జరగాలని బద్ధశత్రువులైన కరుణానిధి, జయలలిత వర్గాల ఎంపీలంతా
పార్లమెంట్‌లో (తమిళంలో పారాళుమన్రం) రెండు నెలల కిందట కలసికట్టుగా గొడవ
చేశారు. వాళ్ళంతా వెర్రోళ్ళయితే నేనూ వెర్రోణ్ణే... Auditor, Inspector,
SI, SP లాంటి వాటికి హిందీ ప్రసార మాధ్యమాలు వాటి అనువాదాల్ని
వాడుతున్నాయి. మీరూ గమనించవచ్చు. గతంలో Telescopeకి దుర్భిణి,
Microscopeకి సూక్ష్మదర్శిని అనే పదాన్ని మనం విజ్ఞానశాస్త్రంలో
వాడేవాళ్ళం. మీకు గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ఈ పదాల రూపకల్పన ప్రక్రియ
ఆగిపోయి నేరుగా ఆంగ్ల పదాల వాడకం వచ్చేసింది. అందువల్ల మనం పదాల
రూపకల్పనపై దృష్టి సారించాలి.

ఉన్న కష్టతరమైన అనువాదాల్ని సరళీకరించాలి... రైలు బండికి గతంలో ధూమశకట...
అనే పొడవాటి అనువాదం చేశారు. దీనిని సరళీకరిస్తూ బద్దల బండి అనో లేక
బద్దీ బండి అంటే బాగుంటుందేమో... (Busకి అనువాదమే లేదు) Lorryని
తొట్టిబండి అనొచ్చు, Carని చిన్నబండి లేదా పొట్టిబండి లేదా పెట్టె బండి
అనొచ్చు. Cycleకి తొక్కుడుబండి అని పేరుపెట్టొచ్చు. ఇవే ఉండాలని లేదు.
All India Radio సంస్థకు ఆకాశవాణి అనే పేరుంది. Radioకు, FM Radio
అనువాదం లేదు. కనుక మనం కొత్త పదాల సృష్టిపై దృష్టి పెట్టాలి.

ఒకప్పుడు అనువాదాలుండీ.. నేడు వాడకమే లేకపోయినవాటిపై కన్నేసి ఉంచాలి...
ఉదాహరణకు పాత సినిమాల్లో పేర్లు పడేటప్పుడు మీరు చూస్తే... Recordingకి
ధ్వని ముద్రణ, శబ్దగ్రహణం, Cameraman ఛాయాగ్రాహకుడు... ఇలాగే
నృత్యదర్శకుడు, అలంకారం, కేశాలంకరణ లాంటి పదాలు తెరపై కనిపించేవి.
ఇలాంటివి సేకరించాలి. ఇలాంటివి ఉన్నట్లు ఈ తరంలో చాలామందికి తెలియనే
తెలియదు..

ఇక ఈ తరంవాళ్లకు తెలిసినవీ... కళ్ళముందే కనుమరుగవుతున్న పదాలపైనా దృష్టి
సారించాలి... ఉదాహరణకు తెర... బదులు Screen, వైద్యుడు/రాలు బదులు Doctor,
కాగితం బదులు Paper, దూరవాణి బదులు Telephone, ఆగండి లేదా ఎదురు చూడండి
అనడానికి బదులు wait చెయ్యండి అంటున్నారు. దూరదర్శిని TVగా, నిస్తంత్రీ
Wirelessగా, పిండిమర Flour Millగా, ప్రభుత్వం Governmentగా మారిపోయాయి.
అంటే ఈ పదాలన్నిటికి తెలుగు అనువాదాలున్నాయని చాలామందికి తెలిసీ వాటికి
బదులు ఆంగ్లమే వాడుతున్నారు. క్రమంగా ఈ తెలుగు పదాల వాడకమే పోయి వీటికీ
ముందు చెప్పిన పదాల గతే పడుతుంది. ఇలా జరగకుండా ఆపాలి.

ఏదైనా ఒక పదానికి మన తెలుగులో అనువాదం చేసుకోవడం అత్యంత కష్టసాధ్యం
అనుకున్నప్పుడు, మన ఇరుగు పొరుగు రాష్ట్రాల భాషలు, సంస్కృతం పరిశీలించి
కొత్త పదాన్ని సిద్ధం చేసుకోవచ్చు. ఇలాంటి పరిస్థితి ఎప్పుడోగాని
రాదనుకుంటాను.

ఇక మరికొన్ని పదాల్ని పత్రికల్లోనే చూస్తాం గానీ వాడకంలో ఆంగ్లానికి
వెళుతుంటాం... ఉదాహరణకు మనం కరెంట్ అంటాం.. పత్రికలో విద్యుత్ అని
వాడతారు. ఈనాడు పత్రికలో Fileని దస్త్రం అని, Spectrumని విద్యుదయస్కాంత
తరంగం అంటున్నారు. వీటిని మనం గమనించి దఖలుపరచుకోవాలి. ఒక Database
నిర్వహించాలి. ఈ అధ్యయనానికి సంబంధించి మనకు వనరులుగా... దూరదర్శిని,
పత్రికల్లో వచ్చే శీర్షికలు, మన సన్నిహితులతో జరిపే సంభాషణలు
ఉపయోగపడతాయి. ఈ ప్రక్రియకు సంబంధించి మన "తెలుగుపదం' గుంపులో మరింత
సమన్వయం కావాలి.

మనం ఈ విషయంలో కొంత ప్రయాణం సాగించిన తర్వాత కొన్ని పదాలు తీసుకుని
కరపత్రాలుగా రూపొందించి జనంలోకి పంపే ప్రయత్నం చెయ్యాలి. తమిళనాడులోని
పిఎంకె పార్టీవారు ఇలాగే చేస్తున్నారు. కొత్తగా వచ్చే ఆంగ్లపదాలకు తమిళ
అనువాదాల్ని రూపొందించి బస్టాండ్ల వద్ద ఫ్లెక్సీ బోర్డులు పెడుతుంటారు,
కరపత్రాలు పంచుతుంటారు. పాఠశాలలకెళ్ళి విద్యార్థులకు వివరిస్తుంటారు...

కనుక సోదర సోదరీమణులారా... ఈ నా అభిప్రాయంపై మీ అభిప్రాయాలు
తెలుసుకోగోరుతున్నాను. పై ప్రక్రియను కార్యాచరణలో పెట్టాలని
కోరుకుంటున్నాను. సవరణలు, విమర్శలను ఆహ్వానిస్తున్నాను. పైన వివరించిన
దానిలో తప్పులేమైనా ఉంటే మన్నించగోరుతున్నాను.

ఈ మధ్య కాలంలో జారిపోతున్న మరికొన్ని పదాలుగా అన్నం... సమయం... బల్ల..
విందు అనేవి. అన్నం కావాలి అనడం మానేసి rice కావాలంటున్నారు. గంట
ఎంతయింది అనకుండా time ఎంత అంటున్నారు. బల్ల అనడం మానేసి tableను
తెచ్చారు. విందు అని ఎవరూ అనడంలేదు. party అట.

ఇక కొత్తగా వచ్చినవి అంతగా వాడనివి చూస్తే... timetableని కొన్ని
పత్రికల్లో సమయసారణి అని వాడారు. Appointmentకి తెలుగు పదమే లేదు. (వారి
"సమయం" దొరకలేదు అనొచ్చేమో...). పత్రికల్లో శాసనసభ కనిపిస్తుంది...
వాడుకలో Assemblyగానే ఉంది..., సభాపతి కూడా పత్రికలోనే కనిపిస్తారు...
జనం పలికేది speaker.

వ్యాఖ్యానం పోయింది... comment please అట. ప్రాంగణం, ఆవరణల్ని campus
ఆక్రమించింది. సీసా bottleలోకి వెళ్ళిపోయింది. చిల్లరను change చేసేశారు.
వైఖరి, ధోరణి, తీరు ఉపయోగించని attitude మారాలి. దుకాణం shop అయ్యింది.
కుంభకోణం కనిపించకుండా scam చేశారు. please... దయచేసి కాదట. నొక్కుటను
Press చేశారు. మీట పోయి Switch / Button వచ్చాయి. మైదానం stadiumలోకి
వెళ్ళిపోయింది. పాత్రికేయులు, విలేఖర్లు journalistలయ్యారు.

ఆ మధ్య మరికొన్ని కొత్త ప్రయోగాలు చూశానండోయ్... గ్రామాలు కాదు గ్రామంలు,
పుస్తకాలు కాదు పుస్తకంలు... వాడుక పదాల్నే కాదు వాడుకనే మార్చే పండితులు
పుట్టుకొచ్చారు...

అభిప్రాయం చెప్పండి బాబూ అంటే opinion చెబుతామంటున్నారు. ఆసుపత్రికి
మానేసి hospitalకు వెళుతున్నారు. మంచం పక్కనపెట్టి bed ఎక్కుతున్నారు.
కంచంలో తినడంలేదు plate తెచ్చుకున్నారు. చెంచా వద్దట spoon వాడకం
పెరిగింది (కనీసం రాజకీయ తమ విమర్శల్లో "చెంచా"గిరి అనే పదబంధం
వాడుతున్నారు. ఆ రకంగా "చెంచా"ను గుర్తుంచుకున్నారు...) పుస్తకాన్ని
ఏనాడో book చేసేశారు. (పత్రికల్లో "కొత్త పుస్తకాలు" అనే శీర్షికలో
మాత్రం పుస్తకాలు కనిపిస్తాయి). ఇంద్రధనుస్సులోని రంగులు rainbowలోకి
వెళ్ళిపోయాయి. ఎంతపెద్ద light, కావలినంత lighting ఉన్నా దీపం,
వెలుతురు.... కనిపించడంలేదు... అర కాస్తా rackలోకి వెళ్ళింది. యంత్రాన్ని
machine, engineగా మార్చారు. ఇంధనం పత్రికకే పరిమితం... జనానికి అది
fuel. బాటలు, రహదార్ల మీద కొత్త Roadలు వేశారు. టపా, తపాలాను post
చేసేశారు. (మన blogలలో టపా ఉంది లెండి). ఈ మధ్యకాలంలో నీరు ఎండిపోయి
water వస్తోంది. మూత, టోపీ మీద cap వేశారు.... Revenue మంత్రి పదంలో
Revenueకి తెలుగే లేదు.

తాజా పరిణామాన్ని గమనిస్తే... తెలుగు భాషలోని రంగులన్నీ వెలిసిపోతున్నాయి
colours కళకళలాడుతున్నాయి. ఆధునిక మహిళలకు ఆకుపచ్చ చీరలు, ఎర్ర గులాబీలు
వద్దట... green sarees, red roses మాత్రమే కావాలట. ఈ రెండే కాదండోయ్
మిగిలిన రంగుల పరిస్థితీ అంతే. ఈ తరం తెలుగు జంతువులన్నీ
చచ్చిపోతున్నాయి. పెద్దలంతా పులులు, కుక్కలు, ఒంటెలు, ఏనుగుల్ని
మింగేశారు. అవి పిల్లల నోళ్ళలోంచి tigers, dogs, camels, elephantsగా
వస్తున్నాయి. కొన్నాళ్ళు పోతే తెలుగు జంతువులు చచ్చి ఆంగ్ల జంతువులే
బతికుంటాయి.

గతంలో Gas (వంటగాలి) అనే పదాన్ని ఆంగ్లంలోనే వాడినా Cylinderను బండ
అనేవారు. దీని బండ బడా అనుకున్నారో ఏమో మన తెలుగు జనం... దానిని
గుదిబండగా భావించి Cylinderను తెచ్చుకున్నారు. నాకు గుర్తొస్తున్న మరొక
పదం నిఘంటువు... అది ప్రస్తుతానికి తెలుగు dictionaryలో దాక్కునుంది. అదే
విధంగా ప్రజలు కలం వద్దంటున్నారు... వారికి Pen కావాలట. ఇక Pencilకు
తెలుగు పదమే లేదు కనుక ఏ గొడవలేదనుకుందాం.

ఇంగ్లీష్ Railనే తెలుగువారు రైలు చేశారు. వాడుక వేరుగా ఉన్నదంటే అప్పట్లో
ఆ భాషను అర్థం చేసుకున్న తీరు అది. అలా చూసుకుంటే మన దృష్టిలో Rail
(పట్టా, రైలుబండి) , Train (రైలు బండి) ని పరిశీలిద్దాం... రైలు బండి
అంటే rail (పట్టా) మీద వెళ్ళే బండి అనేగా అర్థం. అంటే పట్టాబండి అని
తెలుగులో పూర్తిగా చెప్పుకోవచ్చు. అప్పటివాళ్ళు సగం ఇంగ్లీష్ సగం తెలుగు
కలిపి railu బండి చేశారు. అంత మాత్రం చేత Rail తెలుగు పదం ఎలా
అవుతుంది... ఏదో కొన్నేళ్ళ బట్టీ అదే అర్థంలో జనం వాడుతున్నంత మాత్రాన పర
భాషా పదాలన్నీ తెలుగు పదాలు అయిపోతే... బస్సు, పెన్ను (కలం), పేపరు
(కాగితం), షర్టు (చొక్కా) , ఫ్యాంటు (పంట్లాం), ప్లేటు (పళ్ళెం), స్పూను
(చెంచా), స్పీకరు, మైకు.. ఇలా అన్నీ తెలుగు పదాలే అయిపోతాయి. దీర్ఘకాల
వాడుక మాత్రం చేత పర భాషా పదాలు స్థానిక భాషా పదాలైపోతాయనే విశ్లేషణను
అంగీకరిస్తే ఇప్పుడున్న తెంగ్లీష్ (తెలుగు, ఆంగ్ల కలబోత బాష) ను రాబోయే
రోజుల్లో అసలైన తెలుగు భాషగా (ఎక్కువ మంది మాట్లాడుతున్నందున)
పరిగణించవచ్చు కదా. పైన నేను చెప్పిన పదాలన్నటికీ తమిళంలో, హిందీలో,
కన్నడంలో స్థానిక భాషల అనువాదాలు చేసుకుని ప్రసార, ప్రచురణ మాధ్యమాల్లో
వాడుతున్నారు. ఈ పద సృష్టి ప్రక్రియను మనం కొన్ని దశాబ్దాల కిందటే
అటకెక్కించేసి సదరు ఇంగ్లీష్ పదాలన్నీ జనం వాడుతున్నందున అవి తెలుగు
పదాలే అనుకుంటే ఇక ఈ భాషా వ్యాప్తి, చర్చలు, మాతృభాష అనే మాటలకు అర్థమే
ఉండదు. బిల్లు విషయంలో కూడా దానికి తెలుగు పదం సృష్టించుకోవాలి లేదా
గతంలో మరేదైనా పదం వాడుకలో ఉండి ఉంటే పెద్దల నుంచి తెలుసుకుని
పునర్వినియోగం చేసుకోవాలి. అన్నిటికీ తెలుగు అనువాదాలా అంటే... మరి మన
పక్క రాష్ట్రంలోను, హిందీ, కన్నడ భాషల్లో అదే జరుగుతోంది. జపాన్, చైనా,
జర్మనీ ఇంకా ఐరోపా భాషల్లో ప్రతి పరభాషా పదాన్నీ వారి భాషల్లో
అనువదించుకుంటారు, వాడుకుంటారు. అలా జరిగితేనే ఒక భాష ఉనికిలో ఉంటుంది.
దీనిని చాదస్తంగా భావిస్తే చేసేదేమీ లేదు.ఇలా చేసుకోకపోతే మన భాషలోని
పదాలు రాన్రానూ రాలిపోతాయి. చాలా దేశాల ప్రజలకు ఆంగ్లం తెలీదని
గ్రహించండి. ఇటలీ, జర్మనీ లాంటి దేశాల్లో ఈ పరిస్థితి ఉంది. కొత్త పదాలు
సృష్టిద్దాం. ఇదేమి అనువాదం ఇలా ఉందీ అంటూ వెక్కిరించొద్దు. వాడేందుకు
నామోషీ వద్దు, సిగ్గుపడొద్దు. అంతా కలసి ఒక చక్కని ప్రయత్నం చేద్దాం..

15, ఆగస్టు 2011, సోమవారం

పతాక రెపరెపలు..

నాటి నుంచి నేటి వరకు...పతాక రెపరెపలు..
విభిన్న రుపాల్లో..
వివిధ కాలాల్లో..
పతాక రూపమిది,,
ఇది మన జాతి సంపద



Ranganath

"Visit blogadda.com to discover Indian blogs"

అనుచరులు