ప్రపంచ వ్యాప్తంగా మేనేజ్మెంట్(management) రంగానికి ఓ ఆదిగ్రంధంలా విలసిల్లుతున్న భగవద్గీత నేడు విషాదగీతమైందని గుండె క్షోభపడింది.
18 అధ్యాయాలు..
760 శ్లోకాలు..
108 ఉపనిషత్ సారం..
భగవద్గీత.

ఈ రోజు మార్గశుద్ద ఏకాదశి.
గీతా జయంతి.
భగవద్గీత ఆవిర్భవించిన రోజు.
విశేషమేంటంటే భగవద్గీతకు మూలమైన శ్రీ కృష్ణుడు,అర్జునుడు,మార్గశిరమాసం,వ్యాసుడు వీళ్లంతా విష్ణు రూపాలే..
రామాయణాన్ని నారదుడు వాల్మీకికి చెప్పాడు, భారతాన్ని వైశంపాయనుడు జనమేజయుడికి చెప్పాడు, భాగవతాన్ని శుకుడు పరీక్షిత్తుకు చెప్పాడు.
కానీ.. భగవానుడైన నారాయణుడే స్వయంగా అర్జునునికి ప్రబోధించిందే భగవద్గీత. భగవతా నారయణేన స్వయం..
ఇదీ భగవద్గీతకున్న ప్రథమ ప్రశస్తి.
గీత కేవలం పారాయణ గ్రంథం కాదు..ఆచరణ గ్రంథం కూడా.
లౌకికమైన సామాజిక జీవితంలో , పారలౌకికమైన ఆధ్యాత్మిక జీవితంలో మనం లబ్ధి పొందడానికి అనేక మార్గాలను చూపిన గ్రంథమది.
ఎందరో మహానుభావులకు మార్గదర్శకమైంది గీత.
మహాత్మాగాంధి తన అహింసా సిద్ధాంతానికి ప్రేరణ గీతేనని చెప్పారు. స్వామి వివేకానంద, చైతన్యప్రభు వంటివాళ్లె కాదు..
ఐన్ స్టీన్ వంటి విదేశీయులు సైతం గీతతో ప్రేరణ పొందినవారే.
మహాభారతంలోని భీష్మ పర్వంలో 25వ అధ్యాయం మొదలుకొని 42వ అధ్యాయం వరకు ఉన్న 18 అధ్యాయాలు భగవద్గీతగా ప్రశస్తికెక్కాయి.
పేరుకు భారత అంతర్భాగమే ఐనా భగవద్గీత సర్వ స్వతంత్రమైన ప్రత్యేక గ్రంథం. తన బంధు మిత్రులపై యుద్ధం చేయనని అర్జునుడు భీష్మించినపుడు అతనికి కర్తవ్య బోధ చేస్తూ జగద్గురువైన శ్రీ కృష్ణుడు చెప్పిందే భగవద్గీత. జీవన యుద్ధ రంగంలో మన పాత్ర కర్తవ్యాన్ని భగవంతుడు బోధిస్తే ముగిసిపోయిన జీవితం గురించి నిర్వేదాన్ని వ్యక్తం చేయడానికి గీతను వాడుతున్నాం.
చనిపోయిన వారి కోసం ఏడ్చే ఓపిక లేక ప్రత్యామ్నాయమైంది గీత.భగవద్గీత నేడు అంత్యక్రియలకు నేపథ్య సంగీతంలా మారిపోయింది.ఎక్కడ గీత వినిపించినా అక్కడ ఎవరో ఒకరు చనిపోయి ఉంటారనే అభిప్రాయం ఆధునిక తెలుగువాడిలో బలపడింది.
భగవద్గీత మానవ జీవన సంస్కృతీ సారం.
కనీసం రోజుకొకసారైన.. వీలుకాకపోతే వారానికొకసారైనా భగవద్గీత వినండి.
అంత్యక్రియలతో భగవద్గీతకు ముడిపెట్టకండి.
వినోదానికైనా.. విషాదానికైనా..
గీతలాపన చేయడమే గీతాచార్యుడికి ఘన నివాళి.